- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఇల్లెందు/పాల్వంచ, వెలుగు : ‘చేతగాని మాటలు, సొల్లు పురాణాలు చెప్పే వారి మాటలు వినొద్దు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత మాది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక జగదాంబ సెంటర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రంగురంగుల కండువాలతో వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 76 జీవో ప్రకారం ఇండ్లను క్రమబద్ధీకరించే బాధ్యత తనదేనన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణికి పుట్టినిల్లు అయిన ఇల్లెందు ఏరియా కనుమరుగు కానివ్వబోమని, త్వరలోనే పూసపల్లి ఓసీని ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. నిరుపేదల ఇంటి కలను కలగానే మిగిల్చారని, డబుల్ బెడ్‌రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పేదల ఇండ్లను పట్టించుకోకుండా కమీషన్ కోసం కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో ప్రభుత్వ వైద్యశాల, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ స్టేడియం, బుగ్గ వాగు సుందరీకరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
20వ వార్డులో ఆక్రమణకు గురైన ఐదెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, మున్సిపల్ మాజీ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూయ, నాయకులు కోరం సురేందర్, మడుగు సాంబమూర్తి, మండల రాము పాల్గొన్నారు. అలాగే పాల్వంచ డివిజన్‌లోని పలు వార్డుల్లో ప్రచారం చేసి, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. పాల్వంచలో శ్రీనివాసకాలనీ శ్రీనివాసగిరిపైకి రోడ్డు నిర్మించే బాధ్యత తనదేనన్నారు.
